||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదహారవ సర్గ||

||అశోకవనములో ధ్యానములో వున్న సీత||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షోడశస్సర్గః

తత్త్వదీపిక
అశోకవనములో ధ్యానములో వున్న సీత

చాలామంది ఈ సర్గలో కష్టములలో వున్న సీతను చూచి దుఃఖపడిన హనుమనే చూస్తారు.
హనుమ అంతదుఃఖములో వున్న సీత లో చూచినది,
ఆమెలో వున్న ధ్యానదశ.
సీతకు ఎవ్వరూకనపడటల్లేదుట.
రాక్షసస్త్రీలు , అశోకవనములో విరబూచిన పూలు పళ్ళుకూడా కనపడుట లేదుట.
ఆమెకి కనపడుతున్నది ఆమె హృదయములో ఏకస్థుడై నిలచిన రాముడేట.
వాల్మీకి ఈ సర్గలో ధ్యానదశలో వున్న సీతని చూపిస్తాడు
కాబట్టి ఈ సర్గను ధ్యానదశలో సీత అనవచ్చు,
లేక అశోకవనములో సీత అని కూడా అనవచ్చు.

పదహారవ సర్గలో జరిగిన కథ ఈ విధముగా చెప్పవచ్చు.

హనుమంతుడు ప్రశంసింప తగిన ఆ సీతను చూచి,
ఒక క్షణము ఆలోచించి,
భాష్పములతో నిండిన కళ్ళు కలవాడై సీతను గురించి ఇలా అనుకుంటూ విలపింపసాగెను.
'గురువులను గౌరవించు లక్ష్మణునకు మాన్యురాలు,
గురువు వంటి రామునికి ప్రియురాలు అయిన సీత
దుఃఖములలో మునిగి యున్నది అంటే, విధి ఎవరికి తప్పదు అన్నమాట.
రాముని కృతనిశ్చయాన్ని,
ధీశాలి అయిన లక్ష్మణుని కర్తవ్యనిష్టను తెలిసిన సీత,
పొంగిపొరలుతున్న గంగలాగ కలవర పడటము లేదు.
శీలములో వయస్సులో తుల్యులు అలాగే గుణములలో తుల్యులు అగు వీరిలో
రాఘవుడు వైదేహి కి తగినవాడు అలాగే సీత రామునకు తగినది".

హనుమంతుని ఆలోచనాప్రవాహము అలా ముందుకు పోతుంది.

'ఈ విశాలాక్షి కోసము వాలి వధింపబడెను.
రావణునితో పరాక్రమములో సామానుడైన కబంధుడు చంపబడెను.
వనములో జరిగిన యుద్ధములో భీమవిక్రముడైన రాక్షసుడు విరాధుడు రామునిచేత
మహేంద్రునిచే చంపబడిన శంబరుని వలె చంపబడెను.

జనస్థానములో అగ్నిశిఖలతో సమానమైన బాణములతో
పదునాలుగువేల భీమపరాక్రమము గల రాక్షసులు చంపబడిరి.
మహాతేజోమయుడైన, ఆత్మను తెలిసికొనిన రామునిచేత
ఖరుడు అలాగే దూషణుడు కూడా చంపబడిరి.
ఈమె కారణమువలననే సుగ్రీవునకు
వాలిచే పాలింపబడిన దుర్లభమైన వానర రాజ్యము పొందబడినది.
వానరులకు ఐశ్వర్యము కూడా కలిగినది.

ఈ విశాలాక్షి కొఱకే నేను నదినదములకు పతి అయిన సాగరుని దాటి వచ్చితిని.
ఈ లంకా నగరము కూడా నిరీక్షించితిని.
ఈమె కోసము ఒకవేళ రాముడు సముద్రములతో పర్వతములతో కూడిన ఈ జగత్తుని,
తలక్రిందులు చేసినప్పటికీ తప్పు లేదు అని నాకు తోచుచున్నది.
ముల్లోకములరాజ్యమా సీతా అని తూచితే
ముల్లోకముల రాజ్యము సీతకు దీటుకాదు'.

సీతా దేవిని కళ్ళారాచూస్తూ అమెను గురించిన ఆలోచనలలో
హనుమకు సీతారాములపై హనుమంతుని భక్తి పెరుగుతుంది.
ఆ ఆలోచనలు ఇలా సాగుతాయి.

'వరిపండించు క్షేత్రములో
హలము ద్వారా శుభకరమైన పద్మరేణువుల తో భూమిని చేదించి పైకి వచ్చిన ఈ సీత ,
ఆ మిథిలానగరపు మహాత్ముడు, ధర్మశీలుడు అగు జనకమహారాజు యొక్క పుత్రీ అగు ఈ సీత
భర్తపై నిలబడిన పతివ్రత.
ఈమె యశస్విని విక్రాంతుడు ఆర్యశీలుడు యుద్ధములో తిరుగులేనివాడు అగు దశరథుని పెద్ద కోడలు'.

'ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు ఆత్మను తెలిసికొనినవాడు అగు రామునియొక్క ప్రియమైన పత్ని అగు ఈ సీత
రాక్షసుల వశము లో ఉన్నది.
ఈమె అన్ని భోగములను త్యజించి భర్త సేవలోనే మునిగి,
కష్టములగురించి ఆలోచించక నిర్జనమైన వనమును ప్రవేశించెను.
ఈమె ఫలమూలములతో సంతుష్టురాలై భర్తృసేవలో అత్యంత ఆసక్తికలది.
వనములో కూడా రాజభవనములో ఉన్నట్లు ప్రీతి పొందినది.
ఎల్లప్పుడు స్మితవదనముతో భాషించు ఈ కనకవర్ణాంగి,
అనర్థమైన యాతనలను సహించుచున్నది.
రావణునిచే పీడింపబడుతున్న ఈమెను,
పిపాసుడు చలివేంద్రమును చూచుటకు తహతహలాడునట్లు రాముడు చూచుటకు అర్హుడు'.

'రాఘవుడు ఈమెను మరల పొందినప్పుడు
రాజ్యముకోలుపోయి తిరిగి సంపాదించినప్పుడు పొందు సంతోషమును పొందును.
కామభోగములను పరిత్యజించి బంధుజనములకు దూరమైననూ,
ఈమె మరల భర్తతో సమాగముకోసము జీవితము ధరించియున్నది.
ఈమెకు రాక్షసులు కానరారు.
ఫలపుష్పములుకల వృక్షములు కూడా కానరావు.
హృదయములో యున్న రాముడొక్కడే కనిపించును.

భర్త అనే భూషణము భూషణములలో అన్నింటికన్న దీటైన భూషణము.
ఆ భూషణము లేకపోతే భూషణముకు అర్హురాలైనప్పటికి ఆమె శోభించదు.
రాముడు దుఃఖమును సహిస్తూ ఈమె లేకుండా దేహమును ధరించుచున్నాడు అంటే
ఎవరికి సాధ్యము కాని పని చేస్తున్నాడన్నమాట.
నల్లని కేశములు కలది, పద్మములవలె నున్నకనులు కలది,
సుఖజీవనమునకు అర్హురాలైనప్పటికీ దుఃఖములో నున్న ఈమెను చూచి
నా మనస్సుకూడా క్షోభిస్తున్నది'.

'సహనములో భూదేవి వంటి ,
పద్మములవంటి కన్నులు గల,
రామలక్ష్మణులచే రక్షింపబడిన సీత,
ఇప్పుడు వికృతమైన కళ్ళు గల రాక్షసస్త్రీలచేత చుట్టబడి
చెట్టుకింద దీనమైన స్థితిలో ఉన్నది.
పుష్పభారముచే వంగిన అశోక వృక్షములు,
మంచుతొలగి పోవడముతో వేలాది కిరణములతో వెన్నెలకురుపిస్తున్న చంద్రుడు,
భర్త ఎడబాటులో నున్న ఈమెలో దుఃఖమును పెంపొందిస్తున్నాయి'.

ఈవిధముగా హనుమంతుడు అన్ని విషయములను పరిశీలించి ఈమె సీతయే అని నిశ్చయించుకుంటాడు.

ఇది సుందరకాండలో పదహారవ సర్గ లో జరిగిన కథ.

వాల్మీకి హనుమంతుని ఆలోచనలలో మనకి
" కాలోహి దురతిక్రమః" అంటూ
విధి ఎవరికైనా తప్పదు అని చెపుతాడు.
భగవంతునిపై నమ్మకముతో " నాత్యర్థం క్షుభ్యతే దేవీ" అంటూ,
అన్ని కష్టాలలోనూ రామునిపై నమ్మకముతో
మనస్సులో అలజడి లేకుండా వున్న సీత ను చూపిస్తూ,
వాల్మీకి మనకి కష్టాలలో భగవంతునిపై నమ్మకముతో ముందుకుపోవాలి అని సూచిస్తాడు.

ఇంత కష్టాలలో వున్నాసీత రామునిపైగల విశ్వాసముతో కలతచెందకుండా వున్నది అన్నమాటలో
మనకు ఇంకో విషయము తెలుస్తుంది.

సంసారములో బంధింపబడి భగవత్ప్రాప్తికై ఆర్తిపడుతున్న జీవునకు
శోకము కలుగకుండా ధైర్యము కలుగించునవి రెండు విషయాలు.
అవి,
(1) భగవంతునియొక్క వ్యవసాయము- అంటే పట్టుదల
(2) అచార్యుని జ్ఞానవైభవము.

రాముడు యుద్ధకాండలో ఇలా చెపుతాడు,
"నీవాడను అనిన వానికి అభయము ఇచ్చి రక్షించుట నావ్రతము " అని .

"సకృదేవ ప్రపన్నాయ త్వాస్మీతి చ యాచతే|
అభయం సర్వ భూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ"|| (యుద్ధకాండ18.33)||

"అభయం సర్వ భూతేభ్యో దదామి" అన్న
ఆ భగవద్వాక్యమే మనకు శరణము.
మనకి శరణు ఇవ్వడమే కాక ,
"ఏతత్ వ్రతం మమ" అంటే
అలా శరణము ఇవ్వడమే ఆ తనవ్రతము అంటాడు.
అది భగవంతుని పట్టుదల.

ఈ మాట ఇంకోసారి కూడా రామాయణములో మనకి వినిపిస్తుంది.
దండకారణ్యమున ఋషులు శరణు కోరినప్పుడు,
సీతమ్మ వారింప ప్రయత్నింపగా
శ్రీరాముడు ఇలా అంటాడు:

"అప్యహం జీవితం జహ్యం త్వాం సీతే సలక్ష్మణామ్|
నతు ప్రజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః" ||( అరణ్య10.19)||

అంటే " ఆశ్రితులకు ఒనర్చిన ప్రతిజ్ఞలను పాలించుటకు,
అవసరమైనచో జీవితమైననూ సీతనైననూ లక్ష్మణుని అయిననూ విడువగలను" అని.
అలా పలికిన భగవంతుని పట్టుదలపై నమ్మకమే జీవులకు శరణము.

ఆ రాముని పట్టుదలే,
రావణుని బంధములో నున్న సీతకు కూడా ధైర్యము ఇస్తుంది.
సీతకి ధైర్యము కలిగించేది ఇంకోటి లక్ష్మణుని ధీశక్తి.

ఇక్కడ ధీమంతుడగు లక్ష్మణుని ధీశక్తి శరణము.
మాయా మృగమగముని అనుసరించి పోవుచున్న రామునకు
ఆ మృగము మృగము కాదు అని ఉపదేశించిన వాడు లక్ష్మణుడు.
సీతా అన్వేషణలో సహాయపడి రక్షణ ప్రేరేపించినవాడు లక్ష్మణుడు.
అట్టి లక్ష్మణుని జ్ఞానమునకు శరణము.

అంటే వాల్మీకి సూచిస్తున్నది లక్ష్మణుని ధీశక్తి సీతమ్మకు ధైర్యము కలిగించినట్లు ,
అచార్యుని జ్ఞానవైభవము కూడా జీవునికి శరణమే.

భగవంతుడు ఆశ్రితులను రక్షించు పట్టుదలగలవాడు.
ఒకవేళ వారి కర్మము అనుసరించి భగవంతుడు ఉదాసీనుడైనట్లు అనిపించిననూ
ఆచార్యుడు రక్షింప యత్నము చేయును.

ఇక్కడ సీతమ్మ క్షోభ చెందకుండా ఉండడానికి కారణము సూచిస్తూ,
జీవులు బంధములో ఉన్నప్పటికీ,
ఎందువలన శోకించకోడదో ఇక్కడ మనకు సూచితమైనది.

ఈ సర్గలో సీతారాములు "తుల్యశీల వయోవృత్తాం" అని వర్ణింపబడిరి.
వధూవరులకు
(1) శీలము
(2) వయస్సు
(3)వృత్తము (నడువడి)
(4) అభిజనము(వంశము)
(5)లక్షణము అని
ఈ ఐదు సమానముగా ఉండవలెను.

ఇక్కడ రాముడు రఘువంశ జాతకుడు.

విశ్వజిత్ అను యాగమును చేసి బ్రాహ్మణులకు సర్వస్వమును అర్పించి,
ఆ తరువాత గురుదక్షిణకై యాచింపవచ్చిన కౌత్సుని కొఱకై ,
మంత్రజపము చేసి కుబేరుని జయించుటకు పోవలెనని రఘు సంకల్పించెను.
అంతట కుబేరుడే బంగారు నాణెముల వర్షము కురిపించెను.
వాటిని అన్నిటినీ కౌత్సునికే ఒసంగి తీసుకుపొమ్మని రఘు,
తాను కోరినదానికంటె వలదు అని కౌత్సుకుడు పట్టుదలపట్టిరి.

అలా తన దగ్గర లేకపోయిననూ కోరిన కోరికలకు అధికముగా ఒసంగెడి దాత, రఘు మహారాజు.
రాముడు అట్టి ఉదార రఘువంశములో పుట్టెను.

వైదేహి - అనగా దేహముకూడా తనదని భావింపని
మహాజ్ఞానులగు విదేహుల వంశమున జనించినది. ఆమె సీత.

అలా ఇద్దరూ మంచి తుల్యమైన వంశములో జన్మించిన వారే అని చెప్పడమైనది.

ఇలా చెప్పి 'తం' అంటే రామునకు 'ఇయం' అంటే సీతకూ
సాదృశ్యము చూపుచూ వారికి సర్వనామములు ఉపయోగించబడినవి.

ఇక్కడ రాముడు 'తత్' శబ్దముచేచెప్పబడువాడు.
తత్ అన్నది పరబ్రహ్మ వాచకము.
ఇయం అన్నది లక్ష్మీ వాచకము -
'ఇ'కారము లక్ష్మీ వాచకము.

ఇక్కడ సీతకు ' అసితేక్షణా' అను పదము అధికముగా వాడపడెను.
సుందరకాండలో సీత యొక్క నేత్ర సౌందర్యము అధిక ముగా వర్ణింపబడెను.
'అసితేక్షణా', 'విశాలాక్షీ', 'శుచిస్మితా' అంటూ.

ఇందామె నేత్రములకు గల నల్లతనము, వైశాల్యము, చిరునవ్వుతో గల పవిత్రత కనపడును.

ఆమె నేత్రములు బాహ్యముగా విశాలముగా వుండి నల్లదనము కలవి అందుచే అందమైనవి.

అమె తనను హింసించురాక్షస స్త్రీలపై కూడాకోపమును తెచ్చుకొనుట ఎరుగదు.
కంటి తుద ఎరుపెక్కుటలేదు.
పరమ దయామయి. చల్లని తల్లి.
తనకి ద్రోహము చేసిన వానిని కూడా పుత్రునిగా భావించెడి ఔదార్యము కలది.
అందువలన సీతమ్మ యొక్క కనులలో గల చల్లదనమే నల్లతనము..
ఆ నల్లదనమే వాత్సల్యము.
ఆ వాత్సల్యముగల చూపులే సీతమ్మకు రాముని కంటె విశేషము.

భగవానునికంటే లక్ష్మికి గల వాత్సల్యము ఈ విశేషమే.

సర్వేశ్వరుడు జీవులు చేసిన అపరాధములు క్షమింపడు.
తదనుగుణముగా ఫలములను ఇచ్చును.
అతడు నిగ్రహమునకు అనుగ్రహమునకు సమర్థుడు.

కాని లక్ష్మి అనుగ్రహమునే తప్ప నిగ్రహమును ఎఱుగదు.
ఆమె వాత్సల్యస్వభావము కలది.
అందుచే నేత్రములు నల్లనివి, విశాలములు.
అలాంటి లక్ష్మీ స్వభావమే సీత స్వభావము.

అలాంటి సీతను చూచి హనుమంతుడు
"నైషాపశ్యతి రాక్షస్యః న ఏమాన్ ఫలద్రుమాన్|
ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి"

హనుమంతుడు సీతాదేవి గురించి ఆలోచనలలో,
"ఈమెకు రాక్షసులు కనపడుటలేదు.
చెట్లమీదవున్న ఫలపుష్పములు కనపడుట లేదు.
ఆమెకు హృదయములో నిలబడి వున్న ఆ రాముడే కనిపిస్తున్నాడు."
అని అనుకుంటాడు.
ఇది ధ్యాన దశ.

సీతయున్న వనము అశోకవనము.
ఆ ధ్యానదశ ఒక శోకరహిత స్థితి.
అమెకి ఆ ధ్యానదశలో రాముడే కనిపిస్తాడు.

ఒకే వస్తువుని తలచుచూ, ఇతరవస్తువులు చూడక ,
అన్నివేళల అంతటా ఒకే వస్తువును గాంచుట ఈ దశ ( భక్తి దశ) యందు ఏర్పడును.
విషయములనుండి మనసు వెనుతిరిగి,
భగవంతునే సర్వత్ర చూచుచూ ధ్యానించెడి ఈ ధ్యాన దశలో శోకము ఉండదు.
బాహ్యముగా విడివడియున్నట్లున్ననూ అంతరంగముగా కలిసియే యుండును.
ఇట్టి దశపొందినవాడే భగవత్సంశ్లేషమునకు యోగ్యత కలిగనట్లు భావింపబడును.

సీతమ్మ బాహ్యముగా విడిపోయినా, అంతరంగముగా రామునితో లీనమై యుండెను.
అదే అశోకవనములో వున్న సీత.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||